Loading...|Vijayawada: --°C
అలక వీడారు…ఐక్యత చాటారు…పేట టీడీపీలో కీలక పరిణామం
Political - Development News

అలక వీడారు…ఐక్యత చాటారు…పేట టీడీపీలో కీలక పరిణామం

AI Media October 18, 2026 0 min read

ఏఐ మీడియా, నాయుడుపేట (ప్రత్యేక ప్రతినిధి): స్థానిక ఎన్నికల పుణ్యాన తెలుగు తమ్ముళ్లు అలక వీడి ఐక్యత చాటారు. 2024 పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో సూళ్లూరుపేట, నాయుడుపేట ప్రాంతాలకు చెందిన నాయకులు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ గెలుపు కోసం చిత్తశుద్ధితో కృషి చేశారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ జెండాను వదలకుండా, కార్యకర్తలకు అండదండగా ఉంటూ, అప్పటి వైసీపీ నాయకుల ఆరోపణలు, విమర్శలు, కక్షసాధింపు చర్యలను దీటుగా ఎదుర్కొని పార్టీ అభివృద్ధికి కృషి చేయడంలో సూళ్లూరుపేటకు చెందిన వేనాటి సతీష్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారనేది జగమెరిగిన సత్యం. అదేవిధంగా నాయుడుపేటలో శిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి, మొదటి నుంచి టీడీపీని అంటిపెట్టుకుని పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన కందల కృష్ణారెడ్డి తమ స్థాయిలో పార్టీ అభివృద్ధికి, ఎమ్మెల్యే విజయానికి కృషి చేసినవారే. సహజంగా ఏ పార్టీలోనైనా నాయకులు తమ పార్టీ అధికారంలోకి వస్తే అధికార దర్పాన్ని ప్రదర్శించడం, అన్నీ తామే అనే ధోరణిలో ఉండటం పరిపాటి. కానీ సూళ్లూరుపేట, నాయుడుపేట ప్రాంతాలకు చెందిన నాయకులు 2024లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నెలలపాటు అధికార దర్పానికి దూరంగా ఉండటం విశేషం.కొన్ని రాజకీయ పరిస్థితుల ప్రభావంతో పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనలేకపోయారు. పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తడంతో, వీరు ఎవరితో, ఏ విషయంలో విభేదిస్తున్నారో తెలిసినప్పటికీ, వారి మధ్య సయోధ్య కుదిర్చే సాహసం ఎవరూ చేయలేకపోయారు. ఆ నాయకులు వ్యక్తులతో విభేదించినప్పటికీ, పార్టీ కార్యక్రమాలకు వ్యక్తిగత విభేదాలను ముడిపెట్టకుండా, అధిష్ఠానం పిలుపు మేరకు పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ఎన్నడూ వెనకడుగు వేయలేదు. నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం కొంతవరకు పార్టీ శ్రేణులపై ప్రభావం చూపడంతో, కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో నాయకులు అలక వీడి ఐక్యత చాటుకోవడంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం నాయుడుపేటలో జరిగిన సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీ ఎన్నికల సమీక్ష సమావేశంలో వేనాటి సతీష్ రెడ్డి, శిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి, కందల కృష్ణారెడ్డిలు సమావేశ మందిరంలోకి రావడంతో ఎమ్మెల్యే విజయశ్రీ ఘన స్వాగతం పలకడంపై పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. నాయకులందరూ కలిసి మాట్లాడుకోవడం, రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలకు శ్రీకారం చుట్టడం నియోజకవర్గంలో టీడీపీలో శుభ పరిణామమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Leave a Comment