అసత్య ప్రచారాన్ని పటాపంచలు చేసిన ఆదవరం బ్రదర్స్
ఏఐ మీడియా, (ప్రత్యేక-ప్రతినిధి): నాయుడుపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పదవిని ట్రినిటీ అధినేత ఆదవరం నాగూరయ్య కుటుంబ సభ్యులకు ఇస్తామని గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయిన అసత్య ప్రచారాన్ని నాగూరయ్య తనయులు డాక్టర్ సందీప్, డాక్టర్ అనుదీప్ పటాపంచలు చేశారు. గురువారం నాయుడుపేటలో జరిగిన టీడీపీ ఎన్నికల సమీక్ష సమావేశంలో వారిరువురూ పాల్గొని, టీడీపీకి తాము, తమ కుటుంబ సభ్యులు విధేయులమని చాటిచెప్పారు. ఈ సందర్భంగా పలువురు ఆదవరం బ్రదర్స్‌ను అభినందిస్తూ, రాబోయే కాలంలో వారికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని కితాబిచ్చారు.ఈ సందర్భంగా ఆదవరం బ్రదర్స్ ‘ఏఐ మీడియా – ప్రత్యేక ప్రతినిధి’తో మాట్లాడుతూ, తమ కుటుంబంపై సోషల్ మీడియా వేదికగా కొందరు రాజకీయ దురుద్దేశంతో తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తప్పుడు ప్రచారం వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొన్నామని, తాము టీడీపీని విడిచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
